మోదీ బిహార్ కు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేమంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్లు
ప్రతిగా మోదీ లిట్టి చోఖా తింటే.. వీరికి కడుపు మండుతోందంటూ బీజేపీ విమర్శలు
త్వరలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండటంతో క్రియాశీలకంగా మారిన పార్టీలు
ఇటీవల ఢిల్లీలోని హస్త కళా ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ 'లిట్టి చోఖా' తిన్న అంశం బిహార్ లో మంటలు రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, ప్రతిపక్షం ఆర్జేడీ మధ్య విమర్శల వార్ నడుస్తోంది. తొలుత మోదీ చేసిన పనిని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ట్వీట్లు చేశారు. “మీరు మా ప్రత్యేక వంటకం లిట్టీ చోఖా తినొచ్చు.. కానీ మీరు మాకు చేసిన ద్రోహాన్ని బిహార్ ఎప్పటికీ మర్చిపోదు” అని విమర్శించారు.
ఇప్పటికైనా ఫండ్స్ ఇస్తారని భావిస్తున్నాం
హస్తకళా ప్రదర్శనలో లిట్టి చోఖా తిన్నాక ప్రధాని మోదీ పెట్టిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ తేజస్వి యాదవ్ మరో ట్వీట్ కూడా చేశారు. ‘‘బిహార్ కు చెందిన ప్రత్యేక వంటకాన్ని ఇష్టపడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. బిహార్ సీఎం రాష్ట్రాన్ని, రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదు, మిమ్మల్ని అడగడం లేదు కూడా. అందువల్ల మీరు ఇచ్చిన హామీల మేరకు బిహార్ కు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక నిధులు, వరద సహాయక నిధులు, ఆయుష్మాన్ భారత్ కు ఫండ్స్ ఇవ్వడంపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.
దీటుగా జవాబిచ్చిన బీజేపీ రాష్ట్ర శాఖ
ఢిల్లీలో మోదీ లిట్టి చోఖా తింటే.. ఇక్కడ బిహార్ లో కొందరికి కడుపు మండుతోందని బిహార్ బీజేపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ విమర్శించారు. బిహార్ వంటకాన్నే కాదు, బిహార్ రైతులను, ఇక్కడి వారిని కూడా ప్రధాని గౌరవించారని చెప్పారు. ప్రధాని ఢిల్లీలో బిహార్ ప్రత్యేక వంటకం తిన్న రోజునే తాము బిహార్ లో రైతుల ఆదాయం పెంచే అంశంపై వారితో సమావేశం నిర్వహించడం యాదృచ్చికమన్నారు.