రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. ఢిల్లీ బీజేపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర చీఫ్​ ఆదేశం

  • ఉద్రిక్తతలు పెరగడంతో జాగ్రత్త చర్యలు
  • అమిత్ షాతో భేటీ అనంతరం ప్రకటన
  • ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని హెచ్చరిక
ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారడం, 20 మంది వరకు చనిపోవడంతో.. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ శ్రేణులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలెవరూ ఎలాంటి కామెంట్లు, ప్రదర్శనలు వంటివి చేయవద్దని, అది ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రమాదముందని స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే కామెంట్లతో..

ఢిల్లీ బీజేపీ లీడర్లు కొన్నిరోజులుగా యాంటీ సీఏఏ ఆందోళన కారులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో అల్లర్లు మరింతగా పెరిగిపోయాయి. అంతేగాకుండా బీజేపీ, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు తీయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. తాజాగా ట్రంప్ పర్యటన సమయంలో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం జాగ్రత్త చర్యలు చేపట్టింది.

అమిత్ షాతో భేటీ తర్వాత..

ఢిల్లీలో పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆందోళనలను నియంత్రించే చర్యలపై చర్చించారు. మనోజ్ తివారీ ఆ సమావేశంలో పాల్గొని వచ్చిన తర్వాత ప్రకటన చేశారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు. కొందరు ఢిల్లీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కావాలనే బీజేపీ లీడర్ల వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


More Telugu News