నా మర్యాదకు భంగం కలుగుతోంది... అందుకే స్పందిస్తున్నా: కథానాయిక మెహరీన్

  • మెహరీన్ పై అశ్వత్థామ నిర్మాత ఆరోపణలు చేసినట్టు కథనాలు
  • ఆమె హోటల్ బిల్లులు నిర్మాతే చెల్లించినట్టు వార్తలు
  • బిల్లులు తన మేనేజర్ చెల్లించాడని వెల్లడించిన మెహరీన్
  • ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని వ్యాఖ్యలు
ఇటీవల అనేక విజయాలు సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న యువ నటి మెహరీన్ ఓ వివాదంపై స్పందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నటించిన అశ్వత్థామ చిత్రంలో మెహరీన్ నటించారు. ఈ సినిమా జనవరిలో విడుదలైంది. ఇటీవల అశ్వత్థామ చిత్ర నిర్మాత నటి మెహరీన్ పై ఆరోపణలు చేసినట్టు కథనాలు వచ్చాయి. మెహరీన్ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా ఆమె హోటల్ బిల్లులు తామే చెల్లించాల్సి వచ్చిందని నిర్మాత చెప్పినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై మెహరీన్ స్పందించారు. తన మర్యాదకు భంగం కలుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో స్పందించక తప్పడంలేదని అన్నారు.

ఈ వివాదం గురించి మాట్లాడడం ఎందుకులే అని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని, కానీ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుండడంతో ఇప్పుడు మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చింది. అశ్వత్థామ చిత్రం ప్రమోషన్స్ సమయంలో తన తాతయ్యకు గుండెపోటు వచ్చిందని, ఆ కారణంగా అశ్వత్థామ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినా హాజరు కాలేకపోయానని స్పష్టం చేసింది.

నాగశౌర్య కూడా కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయం తెలిపాడని, అయితే ఒక ఇంటర్వ్యూకి మాత్రం తాను స్కిన్ అలర్జీతో రాలేకపోయాయని మెహరీన్ పేర్కొంది. ఆ సమయంలో నిర్మాత తన హోటల్ రూమ్ బిల్లులు చెల్లించనని చెప్పడంతో, తన మేనేజర్ సాయంతో తానే బిల్లులు చెల్లించినట్టు మెహరీన్ వెల్లడించింది. ఇప్పటికి తాను 14 సినిమాల్లో నటించినా ఎవరితోనూ ఇలాంటి ఆర్థికపరమైన వివాదాల్లో చిక్కుకోలేదని, ఇప్పుడు పరిస్థితి తీవ్రత దృష్ట్యా వాస్తవాలు వెల్లడిస్తున్నానని వివరణ ఇచ్చింది.


More Telugu News