తన ఆరేళ్ల ప్రస్థానంపై సోషల్ మీడియాలో స్పందించిన విజయశాంతి

  • ఫిబ్రవరి 25కి కాంగ్రెస్ లో చేరి ఆరేళ్లయిందన్న విజయశాంతి
  • పార్టీకి, కార్యకర్తలకు, అభిమానులకు ఫేస్ బుక్ లో కృతజ్ఞతలు
  • తన కార్యాచరణను సమీక్షించుకుంటానని వెల్లడి
 ఇటీవలే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి అటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆరేళ్లయింది. ఇప్పుడామె ప్రస్థానం ఏడో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా విజయశాంతి ఫేస్ బుక్ లో స్పందించారు. అప్పట్లో తాను సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఫిబ్రవరి 25కి కాంగ్రెస్ లో చేరి ఆరేళ్లయిందని వెల్లడించారు. తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు అంటూ పోస్టు చేశారు.

తనకు మొదటి నుంచి నిర్మాణాత్మక ఉద్యమాలు అలవాటని, అయితే ప్రజాక్షేత్రంలో నిర్వహించాల్సిన పోరాటాలకు మరికాస్త దూకుడు అవసరమని భావిస్తుంటానని పేర్కొన్నారు. గతంలో తాను చేపట్టిన ప్రజాపోరాటాలకు హైకమాండ్ అండదండలు ఉన్నా, పరిస్థితుల కారణంగా అనేక మార్పులు చవిచూడాల్సి వచ్చిందని వివరించారు. తన కార్యాచరణను మరోసారి సమీక్షించుకుని భవిష్యత్ కార్యకలాపాలను ప్రజా సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటానని వెల్లడించారు.


More Telugu News