పేదల భూములను వైసీపీ ప్రభుత్వం లాక్కుంటోంది: దేవినేని ఉమ ఫైర్

  • టీడీపీ హయాంలో పేదలకు 5 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం
  • అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటోంది
  • చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు ఐదు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వాటన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం వాళ్ల దగ్గర నుంచి లాక్కుంటోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసైన్డ్ భూములను, పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటూ  చట్టవిరుద్ధంగా, రెవెన్యూ రికార్డులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గ్రామాల్లో పేదల భూములను, అసైన్డ్ భూములను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన భూములను వైసీపీ నాయకులు లాక్కుంటూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.  నన్నయ్య తెలుగు యూనివర్శిటీకి చెందిన ఇరవై ఎకరాల భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుంటే తెలుగు భాషను ఉద్ధరిస్తామంటున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆ మహా తల్లి ఏం చేస్తున్నారంటూ పరోక్షంగా లక్ష్మీపార్వతిని విమర్శించారు.

 గ్రామాల్లో చిన్న పిల్లల ఆట స్థలాలను కూడా లాగేసుకుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. పేదలకు మంజూరైన ఇళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని,  సబ్సిడీపై ఇళ్లు కట్టించామని, వారికి చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారికి బ్యాంకు నోటీసులు వస్తున్నాయని అన్నారు. పేదలపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.


More Telugu News