ఈ నెలలోనైనా వారికి ఉరిశిక్ష అమలవుతుందని ఆశిస్తున్నా..: నిర్భయ తండ్రి

  • పవన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో వ్యాఖ్య
  • తిరస్కరణను సుప్రీంలో సవాల్ చేసే చాన్స్
  • కోర్టు పిటిషన్ కొట్టివేస్తే ఉరి శిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగినట్టే..
నిర్భయ కేసులో దోషులకు ఈ నెలలోనైనా ఉరిశిక్ష అమలవుతుందని ఆశిస్తున్నానని నిర్భయ తండ్రి అన్నారు. దోషి పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే మిగతా ముగ్గురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. వారికి సంబంధించి ఇప్పటికే అన్ని అవకాశాలు కూడా పూర్తయ్యాయి.

ఇంకో చాన్స్ ఉంది

పవన్ కుమార్ గుప్తాకు మాత్రం రాష్ట్రపతి నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. దానిని కోర్టు కొట్టివేస్తే ఇక నలుగురి నిందితులకు ఉరిశిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులూ మూసుకుపోయినట్టేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాతో నిర్భయ తండ్రి మాట్లాడారు.

త్వరలోనే న్యాయం జరుగుతుంది

‘‘మిగతా దోషుల్లాగానే.. ఈ దోషికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఈ నెలలోనే వారికి ఉరి శిక్ష అమలవుతుందని ఆశిస్తున్నాం. చాలా కాలం వేచి ఉన్న తర్వాత అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం” అని నిర్భయ తండ్రి పేర్కొన్నారు.


More Telugu News