కరోనా బాధిత దేశాలకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన ఐఎంఎఫ్

  • చైనా సహా 70కి పైగా దేశాల్లో కరోనా ప్రభావం
  • కుదేలైన ప్రపంచ ఆర్థిక అభివృద్ధి
  • కరోనాపై పోరాడేందుకు ఐఎంఎఫ్ చేయూత
  • తమ ఆర్థికసాయం అనేక దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఐఎంఎఫ్
కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడమే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. చైనా వంటి అగ్రదేశం కూడా కరోనా తాకిడితో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కరోనా ప్రభావిత దేశాలకు చేయూతనిచ్చేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో 50 బిలియన్ డాలర్ల భారీ ఆర్థికసాయం ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక పురోగతి గతేడాది కంటే దిగువస్థాయికి చేరిందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా సహా 70కి పైగా దేశాలను కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ఆర్థికసాయం కాస్తంత ఉపశమనం కలిగించనుంది. తాము ప్రకటించిన ఆర్థికసాయంతో పేద, మధ్య తరహా ఆదాయ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా తెలిపారు. కరోనా కారణంగా పతనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి మున్ముందు ఏ స్థాయికి చేరుతుందన్నది అంచనా వేయలేకపోతున్నామని పేర్కొన్నారు.


More Telugu News