మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే నిందలు వేస్తారా?: బీసీ రిజర్వేషన్లపై నారా లోకేశ్
- జగన్ కు చిత్తశుద్ధిలేక మమ్మల్ని నిందిస్తే ఎలా
- హక్కుల సాధనకే సుప్రీం కోర్టుకు
- మీ తీరువల్ల 16 వేల మంది బీసీలకు పదవులు దూరం
బీసీల రిజర్వేషన్లను కాపాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడాల్సిన మీరు ఆ పనిచేయక పోగా, హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ వైసీపీని ఉద్దేశిస్తూ అన్నారు.
'మీ తీరువల్ల 16 వేల మంది బీసీలు పదవులకు దూరమవుతారు. అంటే అన్ని పదవులు మీరే ఏలుదామని నిర్ణయించుకున్నారా? బీసీలపై జగన్‌కు, వారి పత్రికకు ఎందుకంత కక్ష. పక్క రాష్ట్రంలో 22 శాతమే ఉంటే మన రాష్ట్రంలో అంత ఎందుకని రాతలు రాస్తారా?' అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
బీసీల రిజర్వేషన్ పై జగన్‌కు చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని, అందుకే యాభై శాతం రిజర్వేషన్లు చాలని సుప్రీంకోర్టు చెప్పిందని కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. అటువంటప్పుడు 59.85 శాతం రిజర్వేషన్ల కోసం జీఓ ఎందుకు ఇచ్చారు, ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారని లోకేశ్ ప్రశ్నించారు.