ఉద్యోగం పేరుతో యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం.. దోషికి యావజ్జీవ ఖైదు!

  • కారులో పలు ప్రాంతాలు తిప్పుతూ అత్యాచారం
  • తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు
  • విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
ఉద్యోగం పేరుతో నమ్మి వచ్చిన యువతిని కిడ్నాప్ చేసి, ఆపై బెదిరించి కారులోనే పలుమార్లు అత్యాచారానికి తెగబడిన కామాంధుడికి జీవిత ఖైదుతో పాటు రూ.90 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని దవులూరుకు చెందిన ఎ.రవిశేఖర్ (48) రైతు. అయితే, ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అతడిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటకలలో 40 కేసులు పెండింగులో ఉన్నాయి.

జులై 23 2019లో ఉద్యోగం పేరుతో తన వద్దకు వచ్చిన 21 ఏళ్ల యువతిని కారులో అపహరించిన నిందితుడు ఆమెను పలు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడిన తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్, హయత్‌నగర్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, కిడ్నాప్ చేసిన యువతిని కారులో కడప, కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు హైదరాబాద్ చేరుకుని పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు గతేడాది ఆగస్టు 3న విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద చిక్కాడు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసు విచారణ సందర్భంగా నేరం రుజువు కావడంతో నిన్న రంగారెడ్డి జిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు రవిశేఖర్‌కు రూ. 90 వేల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


More Telugu News