కరోనా ఎఫెక్ట్: రూ.8.58 కోట్లు నష్టపోయిన కర్ణాటక ఆర్టీసీ
- దాదాపు 2 వేల బస్సులను రద్దు చేసిన కేఎస్ ఆర్టీసీ
- బస్టాండ్లలోనూ ధర్మల్ స్క్రీనింగ్
- అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దన్న డిప్యూటీ సీఎం
కరోనా వైరస్ ప్రభావం కర్ణాటక ఆర్టీసీపై భారీగానే పడింది. వైరస్ భయంతో ప్రజలు ప్రయాణాలు బంద్ చేసుకోవడంతో ఏకంగా రూ.8.58 కోట్లు నష్టపోయింది. డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 1396 బస్సులను రద్దు చేసిన ప్రభుత్వం, నిన్న మరో 550 బస్సులను రద్దు చేసింది. దీంతో పెద్ద ఎత్తున నష్టపోయినట్టు ఆయన తెలిపారు. మరోవైపు, రైల్వే స్టేషన్లలోలానే బస్టాండ్లలోనూ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్కారు. ఆర్టీసీ సిబ్బంది కొందరు సెలవుల్లో ఉన్నా బస్సు సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు.