బీఎస్-4 వాహనాలకు మార్చి 31 డెడ్ లైన్ తొలగింపు... కంపెనీలకు సుప్రీంకోర్టు వెసులుబాటు!

  • డెడ్ లైన్ 10 రోజుల పాటు పొడిగింపు
  • లాక్ డౌన్ ముగిసిన నాటి నుంచి అమలు
  • వాహన కంపెనీలు, డీలర్లకు సుప్రీంకోర్టు ఊరట
ఇండియాలో బీఎస్-4 వాహనాలను విక్రయించేందుకు ప్రస్తుతమున్న మార్చి 31 డెడ్ లైన్ ను తొలగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. లాక్ డౌన్ ముగిసిన తరువాత, మరో 10 రోజుల పాటు అంటే, ఏప్రిల్ 24 వరకూ ఇప్పటికే స్టాక్ బుక్ లో ఉన్న వాహనాలను విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇండియాలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా, ఆఫర్లు కొనసాగుతున్నా, డీలర్లు వాహనాలను విక్రయించుకునే పరిస్థితి లేదని, కాబట్టి, డెడ్ లైన్ ను తొలగించాలని ఎఫ్ఏడీఏ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్), సియామ్ (సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్)లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

తమ వద్ద 12 వేలకు పైగా కమర్షియల్ వాహనాలు, 15 వేలకుపైగా పాసింజర్ కార్లు, 7 లక్షల ద్విచక్ర వాహనాల స్టాక్ మిగిలిపోయిందని, మార్చి 31 లోగా వీటి డిస్పాచ్ అసంభవమని సియామ్, ఎఫ్ఏడీఏలు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డెడ్ లైన్ ను పొడిగించరాదని నిర్ణయించుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు, వ్యాపారులు, డీలర్లలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో లాక్ డౌన్ ముగిసిన తరువాత 10 రోజుల్లోగా తమ స్టాక్స్ ను విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది.


More Telugu News