అలాంటి వార్తలు రాయడానికి సిగ్గుగా లేదూ?: మీడియాపై మండిపడిన ధోనీ భార్య

  • కెట్టో ద్వారా లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ధోనీ
  • ట్రోల్ చేసిన అభిమానులు
  • ఇది బాధ్యతాయుతమైన జర్నలిజం కాదంటూ సాక్షి ఆగ్రహం
కరోనాపై పోరుకు క్రికెట్ దిగ్గజాలందరూ లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తుంటే టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సైతం ధోనీని ట్రోల్ చేస్తున్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలపై ధోనీ భార్య సాక్షి స్పందించింది. ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగింది. ఇలాంటి సున్నిత సమయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇలాటి వార్తలు ప్రచురిస్తున్నందుకు సిగ్గుగా లేదూ.. అని ప్రశ్నించింది. అయితే, ఇంత చెప్పిన సాక్షి.. ధోనీ అసలు విరాళం ఎంత ప్రకటించాడన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవడంతో మరోమారు విమర్శలు గుప్పిస్తున్నారు.

పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ కెట్టో ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. దాదాపు రూ. 800 కోట్ల ఆస్తి కలిగిన ధోనీ కేవలం లక్ష రూపాయలు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సచిన్, గంగూలీ వంటి వారు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. కాగా ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు ధోనీ లక్ష ఇచ్చాడే తప్ప.. పీఎం సహాయనిధికి కాదని ఓ వార్త సంస్థ వివరించింది.


More Telugu News