అమెరికాలో మూడు రోజుల్లో వెయ్యి నుంచి 2,211కు పెరిగిన కరోనా మరణాలు

  • శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి
  • ఒక్క రోజులోనే 23 శాతం పెరిగిన కేసుల సంఖ్య
  • ఇల్లినాయిస్‌లో శిశువు మృతి
అమెరికా ప్రజల్లో కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలు నింపుతోంది. ఇక్కడ గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య రెట్టింపవడం మరింత వణికిస్తోంది. గురువారం 1000గా ఉన్న మరణాల సంఖ్య నేటి ఉదయానికి ఏకంగా 2,211కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా బాధితుల సంఖ్య 1,24,385కు పెరిగింది. కరోనా కేసులు నిన్న ఒక్క రోజే ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం. విస్తృత కరోనా పరీక్షల కారణంగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు తెలిపారు.

న్యూయార్క్‌ను వైరస్ మరింత వణికిస్తోంది. రాష్ట్రంలోని బాధితుల్లో సగం మంది ఈ నగరం వారే. దీంతో నగరం మొత్తాన్ని దిగ్బంధించాలని అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారిపైనే ఇప్పటి వరకు కరోనా పంజా విసరగా, తాజాగా ఇల్లినాయిస్‌లో ఓ శిశువు కరోనా కారణంగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల ఫ్రాన్స్‌లో 16 ఏళ్ల బాలిక ఈ మహమ్మారికి బలైంది. ఇప్పుడు అమెరికాలో ఓ శిశువు మృతి చెందడం ఆందోళన నింపుతోంది.


More Telugu News