శ్రీవారి దర్శనాల నిలిపివేతను మరో 2 వారాలు పొడిగించిన టీటీడీ!

  • పది రోజులుగా నిర్మానుష్యం 
  • రెండు ఘాట్ రోడ్ల మూసివేత
  • స్వామివారికి సేవలు జరుగుతాయన్న టీటీడీ
భక్తుల రాకపై నిషేధం విధించడంతో తిరుమల నిర్మానుష్యమై 10 రోజులు గడిచింది. ఎప్పుడెప్పుడు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారా? అని లక్షలాది మంది వేచి చూస్తున్న వేళ, కరోనా భయం ఇంకా తొలగని కారణంగా లాక్ డౌన్ అమలైనన్ని రోజులూ దర్శనాలను ఆపేయాలని టీటీడీ నిర్ణయించింది.

ఏప్రిల్‌ 14 వరకూ భక్తులకు దర్శనాల రద్దు నిర్ణయం కొనసాగుతుందని టీడీడీ వెల్లడించింది. ఆలయ అవసరాలకు తిరిగే అత్యవసర వాహనాలకు మినహా, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని తెలిపింది. స్వామివారికి చేయాల్సిన అన్ని సేవలూ ఆగమశాస్త్రోక్తంగా జరుగుతున్నాయని, తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ వరకూ అన్నీ జరుగుతున్నాయని తెలిపారు.

వచ్చే నెలలో జరగాల్సిన వార్షిక వసంతోత్సవాలపై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, తిరుపతిలో ఉన్న అనాథలు, నిరుపేదలను ఆదుకొనేందుకు ముందుకు వచ్చిన టీటీడీ, రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News