‘పీఎం కేర్స్’ ఫండ్‌కు రెండేళ్ల జీతం విరాళంగా ఇస్తున్నా: గంభీర్

  • కరోనాపై పోరాటంలో సాయం చేసిన బీజేపీ ఎంపీ
  • ఇతరులు కూడా ముందుకు రావాలని పిలుపు
  • ఇదివరకే ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ. 50 లక్షలు విడుదల
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా  ‘పీఎం- కేర్స్‌’ ఫండ్‌కు తన రెండేళ్ల జీతం విరాళంగా ఇస్తున్నట్టు  బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించారు.  దేశంలో దాదాపు రెండు వేల మందికి సోకి.. ఇప్పటికే యాభై మందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘ఈ దేశం మాకు ఏమిచ్చిందని ప్రజలు అడుగుతారు. కానీ, ఈ దేశం కోసం మీరు ఏం చేయగలరు? అన్నదే అసలు ప్రశ్న. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు నా రెండేళ్ల జీతాన్ని నేను విరాళంగా  ఇస్తున్నా. మీరు కూడా ముందుకు రావాలి’ అని గంభీర్ ట్వీట్ చేశారు.

తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్ సాయం ప్రకటించడం ఇది రెండోసారి. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పేషెంట్లకు చికిత్స అందించే సామగ్రి కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ. 50 లక్షలు విడుదల చేశారు.


More Telugu News