లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమవుతున్న మరో రెండు రాష్ట్రాలు

  • ఇంకా నియంత్రణలోకి రాని కరోనా మహమ్మారి
  • లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ఒడిశా
  • అదే బాటలో పంజాబ్, కర్ణాటక
కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ మరిన్ని రోజుల పాటు పొడిగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే ఆలోచనను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో లాక్ డౌన్ ను పొడిగించేందుకు పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు కూడా సన్నద్ధమవుతున్నాయి.

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని... ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించడమే కరెక్ట్ అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఈ సాయంత్రం నిర్వహించే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు, లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని కర్ణాటక కేబినెట్ అభిప్రాయపడింది. లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేయాలంటూ డాక్టర్లతో కూడిన ఎక్స్ పర్ట్ ప్యానెల్ ఇచ్చిన రెకమెండేషన్స్ ను తిరస్కరించింది. అయితే ప్రధాని మోదీని సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.


More Telugu News