విశాఖలో ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు.. చేసిన మార్పులు ఇవే!

  • వైజాగ్ లో సిద్ధమైన 60 కోచ్ లు
  • మొత్తం 500 పడకలు రెడీ చేసిన అధికారులు
  • కేసుల సంఖ్య పెరిగితే బెర్త్ లే బెడ్లు
కరోనా రోగులకు చికిత్సను అందించేందుకు రైలు బోగీలనే ఐసొలేషన్ వార్డులుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం మేరకు, విశాఖపట్నంలోని 60 కోచ్ లలో 500 పడకలు తయారయ్యాయి. వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో సిబ్బంది ఈ పడకలను తయారు చేశారు. స్లీపర్, ఏసీ కోచ్ లను క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులుగా మార్చారు.

ఇక, ఐసొలేషన్ వార్డులుగా మార్చాలని భావించిన కోచ్ లలో మధ్య బెర్త్ లను తొలగించారు. ఒక కోచ్ కి ఉండే నాలుగు టాయ్ లెట్లలో ఒకదాన్ని స్నానాల గదిగా మార్చారు. ఆరు వాష్ బేసిన్ల వద్దా లిక్విడ్ సోప్ డిస్పెన్సర్, ప్రతి కూపే వద్దా సెలైన్ బాటిల్స్ కోసం నాలుగు హ్యాంగర్స్, పెడల్ ఆపరేటెడ్ డస్ట్ బిన్ లను ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్ లో ఉండే మెడికల్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మూడు కర్టెన్లు ఏర్పాటు చేశారు. అన్ని కూపేల్లో ఆక్సిజన్ స్టాండ్లు, దోమతెరలు ఏర్పాటు చేశారు.

నాన్ ఏసీ బోగీ అయితే, కిటికీలకు ప్రత్యేక దోమతెరలను అమర్చారు. ఇక అధునాతన శానిటైజేషన్ విధానంలో నిత్యమూ బోగీలను శుభ్రం చేస్తామని, అందుకోసం క్లీనింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి పీపీఈలు, మాస్క్ లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.


More Telugu News