ఈ సంక్షోభంలో వ్యవసాయ రంగం ఒక్కటే ఆశలు కలిగిస్తోంది: కేంద్రం

  • లాక్ డౌన్ తో స్థంభించిన దేశం
  • ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం
  • ఆంక్షలు లేకపోవడంతో కొనసాగిన వ్యవసాయ కార్యకలాపాలు
కరోనా రక్కసి రెక్కలు విరిచేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో సర్వ వ్యవస్థలు నిలిచిపోయాయి. ఉత్పత్తి రంగం కుదేలైంది. దాంతో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర మందగమనంలో సాగుతున్నాయి. ఇలాంటి సంక్షుభిత పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఒక్క రంగంపై భారీగా ఆశలు పెట్టుకుంది. అది వ్యవసాయ రంగం. లాక్ డౌన్ సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగాయి. దీనిపై కేంద్రం ఆసక్తికర వివరాలు వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో వేసవి పంటలు సాగవుతున్నాయని, రబీలో నాటిన పంటలు కూడా చేతికి వచ్చాయని పేర్కొంది. రబీలో సాగు చేసిన గోధుమ పంటలో 67 శాతం కోతలు ఈ లాక్ డౌన్ రోజుల్లోనే జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. లాక్ డౌన్ రోజుల్లో కేంద్ర హోంశాఖ సకాలంలో స్పందిస్తూ, తగిన మార్గదర్శకాలు జారీ చేస్తూ వ్యవసాయ రంగానికి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకుందని, వాటి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వివరించింది.

"దేశవ్యాప్తంగా 310 లక్షల హెక్టార్లలో రబీ గోధుమ సాగుచేయగా, వాటిలో 63 నుంచి 67 శాతం కోతలు జరిగాయి. రాష్ట్రాల వారీగానూ మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోతలు జోరుగా సాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో 95 శాతం, రాజస్థాన్ లో 85 శాతం కోతలు పూర్తయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ చివరి నాటికి గోధుమ పంట చేతికి వస్తుందని భావిస్తున్నాం.

ఇక వరి విషయానికొస్తే ఆయా రాష్ట్రాల వాతావరణ పరిస్థితుల్లో తేడా ఉన్నందున కొద్ది రోజుల వ్యవధిలో పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. ఏపీ, తెలంగాణ, అసోం, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 28 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పంట చివరిదశకు రాగా, కొన్ని రాష్ట్రాల్లో కోతలు సాగుతున్నాయి" అని కేంద్రం వివరించింది. రుతుపవన సీజన్ లో గతేడాది కంటే 14 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం కూడా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చిందని పేర్కొంది.


More Telugu News