కిమ్ జాంగ్ ఉన్ పై వచ్చిన వార్తలతో ఉత్తర కొరియా కరెన్సీ పతనం!

  • కిమ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారంటూ వార్తలు  
  • దిగజారిన స్టాక్ మార్కెట్ సూచికలు
  • ఆచితూచి స్పందిస్తున్న వార్తా సంస్థలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపింది. గుండెకు సర్జరీ అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతున్నారన్న వార్త మినహా మరే విధమైన ఇతర సమాచారం ఇంతవరకూ బయటకు రాలేదు.

కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో ఈ ఉదయం 8 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) నార్త్ కొరియా కరెన్సీ 'వాన్' డాలర్ తో మారకపు విలువలో భారీగా పడిపోయింది. డాలర్ తో విలువ 1,239.35 వాన్ లకు చేరింది. ఇదే సమయంలో దేశ స్టాక్ మార్కెట్ సూచిక కోస్పీ, 2.62 శాతం పడిపోయింది. కోస్ డాక్ ఇండెక్స్ 3.47 శాతం దిగజారింది. కొరియా రక్షణ సంస్థ విక్టెక్ ఈక్విటీ ధర మాత్రం సుమారు 30 శాతం పెరిగింది.

ఇదే సమయంలో దేశంలోని పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు హనిల్ హ్యుందాయ్ సిమెంట్, హ్యుందాయ్ ఎలివేటర్ సంస్థల ఈక్విటీ 6 శాతానికి పైగా పతనమైంది. ఇదిలావుండగా, చాలా వార్తా సంస్థలు కిమ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఆచితూచి స్పందిస్తున్నాయి. గుండెకు శస్త్రచికిత్స అనంతరం కిమ్ కు ట్రీట్ మెంట్ జరుగుతోందని 'రాయిటర్స్' ప్రకటించింది. ఆపరేషన్ కు నాలుగు రోజుల ముందు ఆయన తన మంత్రులు, కొందరు ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారని సమాచారం.


More Telugu News