నా కంటే ఎక్కువ కష్టపడిన వారు మరెవరూ లేరు: ట్రంప్

  • ఏ అమెరికా అధ్యక్షుడు చేయనంత చేశాను
  • దేశ చరిత్ర తెలిసిన ప్రజలు ఇదే విషయం చెబుతున్నారు
  • తప్పుడు వార్తలు రాసే మీడియాపై కేసులు వేస్తాం
ప్రజలంతా తనను హార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ చేయనంత పని తాను చేశానని చెప్పారు. తన గురించి, దేశ చరిత్ర గురించి తెలిసిన ప్రజలందరూ ఇదే విషయాన్ని చెబుతున్నారని అన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో తాను దేశం కోసం ఎంతో చేశానని... అయితే ఫేక్ వార్తలతో కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు తాను పని చేస్తూనే ఉంటానని ట్రంప్ చెప్పారు. కొన్ని నెలలుగా వైట్ హౌస్ లో ఉంటూనే... పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని... మిలిటరీ వ్యవస్థను పునర్నిర్మించామని తెలిపారు. అయితే తన కృషిని తక్కువ చేస్తూ న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. నకిలీ వార్తలు రాస్తూ రేటింగులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై కేసులు వేస్తామని ట్రంప్ చెప్పారు. కొందరు మీడియా ప్రతినిధులు వ్యతిరేక ధోరణితో తనను ప్రశ్నిస్తుంటారని... అందుకే ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడంలో అర్థం లేదని అన్నారు. తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా కోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదని చెప్పిన ట్రంప్... శనివారం నుంచి మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.


More Telugu News