ఓ తరం అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టిన రిషి కపూర్... జీవిత విశేషాలు!

  • 1973లో విడుదలైన 'బాబీ'తో తారాపథంలోకి
  • 20 ఏళ్ల పాటు వెండితెరను ఏలిన రిషి కపూర్
  • ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన స్టార్ హీరో
  • ఈ ఉదయం కన్నుమూతతో శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ
అది 1973వ సంవత్సరం!
అప్పటి వరకూ సూపర్ స్టార్ రాజ్ కపూర్ తనయుడిగా మాత్రమే నలుగురికీ తెలిసిన రిషి కపూర్ లోని అసలు కోణాన్ని ప్రపంచానికి చూపిన సంవత్సరం. అప్పటికే 1955లో వచ్చిన 'శ్రీ 420'లో 'ప్యార్ హువా ఎక్ రార్ హువా' పాటలో తళుక్కున బాల నటుడిగా మెరిసి, ఆపై 1970లో వచ్చిన 'మేరా నామ్ జోకర్' చిత్రంలో చిన్నప్పటి రాజుగా నటించి మెప్పించిన రిషి కపూర్ ను హీరోను చేసిన సంవత్సరం.. 'బాబీ' అనే చిత్రాన్ని, రిషి కపూర్ అనే అందాల నటుడిని వెండి తెరకు పరిచయం చేసింది.

రాజ్ కపూర్ తన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, డింపుల్ కపాడియాను హీరోయిన్ గా ఎంచుకోగా, ఆ సంవత్సరం సినిమాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంతో రిషి కపూర్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి యువతుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని 'హమ్ తుమ్ ఏక్ కమరేమే బంద్ హో', 'జూఠ్ బోలే కవ్వా కాటే...', 'మే షాయర్ తూ నహీ...' వంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచి, ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.

ఆ తరువాత రిషి కపూర్ అగ్ర హీరోగా, దాదాపు 20 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలారు. 'లైలా మజ్ఞూ', 'అమర్ అక్బర్ ఆంథోనీ', 'హమ్ కిసీసే కమ్ నహీ', 'దూసరా ఆద్మీ', 'సర్గమ్', 'కూలీ', 'దునియా', 'నాగిన్', 'ఘర్ ఘర్ కీ కహానీ', 'చాందినీ', 'అజూబా', 'రణ్ భూమి', 'దీవానా', 'దామినీ', 'ఈనా మీనా డీకా', 'జై హింద్', 'హమ్ తుమ్', 'నమస్తే లండన్', 'ఓమ్ శాంతి ఓమ్', 'ఢిల్లీ 6', 'లవ్ ఆజ్ కల్', 'డీ-డే', '102 నాట్ అవుట్' వంటి ఎన్నో చిత్రాల్లో మరపురాని పాత్రలను పోషించారు.

1952, సెప్టెంబర్ 4న నాటి బాంబేలోని చెంబూరు ప్రాంతంలో రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్ (నీ మల్ హోత్రా) దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన రిషి కపూర్, చాంపియన్ స్కూల్, మాయో కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన కుటుంబమంతా సినీ పరిశ్రమకు అంకితమైనదే. తాతయ్య పృథ్వీరాజ్ కపూర్, మామయ్యలు ప్రేమ్ నాథ్, రాజేంద్ర నాథ్, ప్రేమ్ చోప్రా, బాబాయిలు షమ్మీ కపూర్, శశి కపూర్ తదితరులంతా వెండి తెరపై సత్తా చూపిన వారే.

రిషి కపూర్, నీతూ సింగ్ ను వివాహం చేసుకోగా, వారికి రిథిమా, రణ్ బీర్ జన్మించారు. కపూర్ కుటుంబ సినీ వారసత్వాన్ని రణ్ బీర్ కపూర్ కొనసాగిస్తున్నారు. ఇక తన రెండో చిత్రం 'మేరా నామ్ జోకర్'తోనే బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు నేషనల్ ఫిల్మ్ అవార్డును కొల్లగొట్టిన రిషి కపూర్ ఖాతాలో ఎన్నో అవార్డులు చేరాయి.

1974లో 'బాబీ' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2008లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఆయన అందుకున్నారు. 2009లో రష్యా ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 2011లో బెస్ట్ లైఫ్ టైమ్ జోడీ అవార్డును భార్య నీతూసింగ్ తో కలిసి అందుకున్న ఆయన, ఆపై ఎన్నో సంస్థల నుంచి జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్నారు.

గురువారం తెల్లవారుజామున 5.20 గంటలకు రిషి కపూర్ తన అసంఖ్యాక అభిమాన లోకాన్ని వదిలేసి వెళ్లిపోయినా.. ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ మంచి అనుభూతులుగా గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు.


More Telugu News