చైనాలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య... ఒకటి!

  • చైనాలో కరోనా కట్టడి విజయవంతం!
  • విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్
  • దేశీయంగా కొత్త కేసుల్లేని వైనం
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. డిసెంబరులో వెలుగుచూసిన ఈ వైరస్ మహమ్మారి చైనాను అతలాకుతలం చేసినా, దృఢసంకల్పంతో పోరాడిన డ్రాగన్ దేశం ఎట్టకేలకు గట్టెక్కింది.

తాజాగా చైనాలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 1 మాత్రమే. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్ హెచ్ సీ) వెల్లడించింది. అది కూడా విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, అంతకుమించి దేశంలో ఎక్కడా కొత్త కేసులు లేవని వివరించింది.

కాగా, చైనా ప్రధాన భూభాగంలో ఇప్పటివరకు 82,875 కేసులు నమోదు కాగా, 77,685 మంది కోలుకున్నారు. 4,633 మరణాలు సంభవించాయి. అటు, కరోనా వైరస్ కు జన్మస్థానంగా అప్రదిష్ఠపాలైన వుహాన్ నగరంలో వరుసగా 28 రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.


More Telugu News