మళ్లీ ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్.. ఐదు రోజుల్లో రెండోసారి

  • శనివారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ములాయం
  • ఒక్క రోజు వ్యవధిలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరిక
  • ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్న ములాయం
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ (80) మరోమారు ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజుల్లో ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ములాయం సోదరుడు శివపాల్ సింగ్ తెలిపారు. విషయం తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

కాగా, ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్న ములాయం గత బుధవారం సాధారణ పరీక్షల్లో భాగంగా ఆసుపత్రికి వెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. మూడు రోజుల చికిత్స అనంతరం శనివారం ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే  ములాయం మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


More Telugu News