వారం క్రితం... లడఖ్ సరిహద్దుల వద్ద చైనా యుద్ధ హెలికాప్టర్లు.. క్షణాలలో దూసుకెళ్లిన భారత్ యుద్ధ విమానాలు!

  • లఢఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనా మరో దుందుడుకు చర్య 
  • వారం క్రితం చైనా మిలిటరీ చాపర్స్ చక్కర్లు
  • మీడియాకు తెలిపిన ఓ అధికారి
  • సరిహద్దుల వద్ద యుద్ధవిమానాలతో పాక్‌ కూడా దుందుడుకు చర్యలు
అసోంలోని భారత్‌, చైనా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న మరో ఘటన వెలుగులోకి వచ్చింది. లడఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఆ ప్రాంతంలో చైనా మిలటరీకి చెందిన హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడాన్ని గుర్తించి భారత్ వైమానిక దళ సిబ్బంది హుటాహుటిన యుద్ధ విమానాలతో అక్కడకు చేరుకున్నారు.

వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. భారత్, చైనా సైనికుల మధ్య సిక్కిం సరిహద్దుల్లో గొడవ జరిగిన సమయంలోనే చైనా యుద్ధ విమానాలు లడఖ్‌లో ఇలా చక్కర్లు కొట్టడం గమనార్హం. నియంత్రణ రేఖ వద్దకు చైనా మిలిటరీ హెలికాప్టర్లు వచ్చాయని తెలుసుకోగానే భారత వైమానిక దళ విమానాలు వెంటనే అక్కడకు చేరుకుని గస్తీలో పాల్గొన్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు ఈ రోజు మీడియాకు తెలిపారు.

నియంత్రణ రేఖను దాటి భారత్ గగనతలంలోకి మాత్రం చైనా హెలికాప్టర్లు ప్రవేశించలేదని వివరించారు. సాధారణంగా ఆ ప్రాంత గగనతలంలో భారత్‌కు చెందిన సుఖోయి 30ఎంకేఐ యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తారు.

 మరోపక్క, హంద్వారాలో హిజ్బుల్ ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపిన అనంతరం భారత తూర్పు సరిహద్దు వద్ద పాకిస్థాన్ ఎఫ్‌-16, జేఎఫ్-17లతో ఇటీవల పాకిస్థాన్‌ చక్కర్లు కొడుతున్న ఘటనలు పెరిగాయి. ఇదే సమయంలో చైనా ఆర్మీ కూడా ఇటువంటి దుస్సాహసానికి పాల్పడుతుండడం గమనార్హం. గతంలోనూ లడఖ్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద చైనా మిలిటరీ తమ యుద్ధ విమానాలతో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడింది.


More Telugu News