లాక్ డౌన్ లో ఇంటికి రావద్దనడంతో... ల్యాంకో హిల్స్ లో 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య!

  • మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చిన వీర వల్లిక
  • ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఒంటరిగా యువతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
లాక్ డౌన్ సమయంలో ఇంటికి రావద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన వీర వల్లిక అనే యువతి, తానుండే అపార్టుమెంట్ 15వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్, మణికొండలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వీర వల్లిక అనే యువతి, మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి, ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ,  ల్యాంకో హిల్స్ లో ఉంటోంది.

లాక్ డౌన్ కారణంగా కార్యాలయం మూత పడటంతో ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ సమయంలో తనను ఎలాగైనా తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులను కోరింది. ఈ సమయంలో రావద్దని, గ్రామంలో సైతం కొత్త వారిని రానివ్వడం లేదని, లాక్ డౌన్ ముగిసేంత వరకూ హైదరాబాద్ లోనే ఉండాలని వారు సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News