మహమ్మారి ఎక్కడిదో విచారించాల్సిందే... 61 దేశాల డిమాండ్ తో ఏకీభవించిన భారత్!

  • ఆస్ట్రేలియా, ఈయూ నేతృత్వంలో ముసాయిదా తీర్మానం
  • సంతకం చేసిన ఇండియా
  • నిష్పాక్షిక, స్వతంత్ర మరియు సమగ్ర దర్యాఫ్తునకు డిమాండ్
కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై నిష్పాక్షిక విచారణను కోరుతున్న 61 దేశాలతో ఇండియా కూడా చేరింది. నేటి నుంచి 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవాలో ప్రారంభం కానుండగా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ ల నేతృత్వంలో కొవిడ్-19 మహమ్మారిపై విచారణ జరిపించాలన్న ముసాయిదా తీర్మానం రానుంది.

ఈ విచారణలో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న నిర్ణయాలు, వైరస్ పుట్టుక తదితరాలపై నిష్పాక్షిక, స్వతంత్ర మరియు సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలని తీర్మానించాలని భారత్ సహా 62 దేశాలు పట్టుబట్టనున్నాయి. కాగా, గత నెలలో ఆస్ట్రేలియా ఈ తరహా విచారణను డిమాండ్ చేసిన తరువాత, పలు దేశాలు మద్దతు పలికాయి. మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేలోగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను కాపాడుకోవడంపైనా చర్చించాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది.

ఇదిలావుండగా, ఈ తీర్మానంపై చైనా సంతకం చేయలేదు. చైనాలోని వూహాన్ నగరం కరోనా పుట్టుకకు కారణంకాగా, అక్కడి ల్యాబ్ లలోనే దీన్ని పెంచి పోషించారని, అది లీక్ అయి, ఇలా ప్రపంచాన్ని పట్టుకుందని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీర్మానంపై ఈయూ దేశాలతో పాటు జపాన్, యూకే, న్యూజిలాండ్, సౌత్ కొరియా, బ్రెజిల్, కెనడా తదితర దేశాలు సంతకాలు చేశాయి.


More Telugu News