మీరున్నది ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా?: రెవెన్యూ అధికారులపై స్పీకర్ తమ్మినేని ఫైర్

  • శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ అధికారులతో తమ్మినేని సమావేశం
  • ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న అధికారులు
  • మీరేంచేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించిన తమ్మినేని
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా మీరున్నది? అంటూ మండిపడ్డారు.

ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకునైనా భూములను ప్రభుత్వ పరం చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించవద్దని, వెంటనే ఖాళీ చేయించాలని అన్నారు. పొందూరు మండలం లైదాం గ్రామంలో అధికారులతో సమావేశంలో తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News