వెంటిలేటర్ లభించక న్యూఢిల్లీలో మాజీ ఎంపీ మేనకోడలి మరణం!

  • కరోనాతో ఇబ్బంది పడిన షాహిద్ సిద్ధిఖీ మేనకోడలు
  • ఆసుపత్రిలో వైద్యులు స్పందించలేదు
  • మండిపడిన షాహిద్
న్యూఢిల్లీలో కరోనా రోగుల పరిస్థితి ఎలా ఉందన్నదానికి ఇది తాజా ఉదాహరణ. మాజీ ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ షాహిద్ సిద్దిఖీ మేనకోడలు సరైన సమయానికి వెంటిలేటర్ లభించక మృత్యువాత పడింది. ఈ ఘటన దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో జరగడం గమనార్హం. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన షాహిద్, ఆసుపత్రిలో రోగులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉందని, ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన మేనకోడలు ముమ్మ‌న్‌ కు అత్యవసరమైనా, ఐసీయూలోకి తీసుకెళ్లలేదని, సమయానికి వెంటిలేటర్ పెట్టలేదని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాల‌ను రక్షించడానికి కృషి చేయాల్సిన ఆసుపత్రులు, దాన్ని పక్కన పెట్టాయని, ఢిల్లీ ప్రజల విష‌యంలో తనకు ఇప్పుడు చాలా బాధ కలుగుతోందని అన్నారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు.

ఢిల్లీ ప్ర‌భుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించిన షాహిద్, ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వాలు రాజకీయాలకే పరిమితమైతే మ‌రింత పెద్ద సంక్షోభం త‌లెత్తుతుందని ఆయన హెచ్చ‌రించారు. త‌న మేనకోడలు ముమ్మన్ అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింద‌ని, చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఎవ‌రూ ఎడ్మిట్ చేసుకోలేదని ఆయన ఆరోపించారు.


More Telugu News