తెలంగాణ ఇంటర్ ఫలితాలు సిద్ధం... సీఎం నిర్ణయం మేర విడుదల!
- రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న ఇంటర్ బోర్డు
- నివేదిక పరిశీలించి ఫలితాల విడుదల తేదీ ఖరారు చేయనున్న సీఎం
- గత పొరబాట్లను పునరావృతం చేయరాదని భావిస్తున్న సర్కారు
తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆమోదం లభిస్తే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ ఫలితాల విడుదల తేదీని ఖరారు చేయనున్నారు. గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎంతటి విపరిణామాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, నాటి పొరబాట్లను పునరావృతం చేయరాదని తెలంగాణ సర్కారు, ఇంటర్ బోర్డు కృతనిశ్చయంతో ఉన్నాయి. కాస్త ఆలస్యమైనా, అన్నీ సరిచూసుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని సర్కారు భావిస్తోంది.