తెలంగాణలో రెండు రోజుల పాటు కరోనా నమూనాల సేకరణ నిలిపివేత!

  • ల్యాబ్ లలో పెరిగిపోయిన నమూనా నిల్వలు
  • 9 రోజుల వ్యవధిలో 36 వేల నమూనాలు
  • రోజుకు 2,290 మంది రిపోర్టులకే అవకాశం
తెలంగాణలో నిత్యమూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాటు నమూనాల సేకరణను నిలిపివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ల్యాబుల్లో నమూనాలు పేరుకుపోగా, నిన్నటికి 8,253 నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితి వుంది. వీటిని మరిన్ని రోజులు నిల్వ ఉంచితే తప్పుడు రిపోర్టులు వస్తాయన్న ఆలోచనతో, వైద్య వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గడచిన 9 రోజుల వ్యవధిలో 36 వేల మంది నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 2,290 రిపోర్టులు మాత్రమే వెలువరించే అవకాశం ఉంది. దీంతో పరిశీలించాల్సిన నమూనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి శనివారం నుంచి నమూనాలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.


More Telugu News