తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఆయన ఇద్దరు మనవళ్లకు కరోనా!

  • ఇటీవలి కాలంలో బస్తీల్లో తిరిగిన పద్మారావు
  • అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం నుంచి హోమ్ క్వారంటైన్
  • వైరస్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే చికిత్స
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కాస్తంత అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం నుంచే హోమ్ క్వారంటైన్ అయ్యారు. ఆపై వైద్యాధికారులు నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపగా, కరోనా సోకినట్టు తేలింది. ఇంట్లో ఇద్దరు మనవలకు కూడా వైరస్ సోకింది. వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మిగతా కుటుంబీకుల శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. వాటి ఫలితాలు వెలువడాల్సివుంది.

కాగా, మోండా మార్కెట్ కు దగ్గర్లోని టక్కర బస్తీలో నివాసం ఉండే పద్మారావు, ఇటీవలి కాలంలో, పలు సమీప బస్తీల్లో తిరిగి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన పర్యటనల్లో ఎవరి ద్వారానో ఆయనకు వైరస్ సోకుండవచ్చని తెలుస్తోంది. పద్మారావు ఇద్దరు మనవళ్లకు వైరస్ సోకిందని కుటుంబీకులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితీ మెరుగుపడుతోందని అన్నారు.

కాగా, నిన్న తెలంగాణలో 975 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 15,394కు చేరగా, మృతుల సంఖ్య 253కు పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 9,559 మంది చికిత్స పొందుతుండగా, 5,582 మంది కోలుకున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో పలు రాజకీయ నాయకులు మహమ్మారి బారిన పడ్డారు. అధికార టీఆర్ఎస్ కు చెందిన మహమూద్ అలీ, పద్మారావులతో పాటు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేశ్ గుప్తాలకు కరోనా సోకింది. కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి కూడా వైరస్ బారిన పడగా, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి వైరస్ నుంచి కోలుకున్నారు. 


More Telugu News