బాలీవుడ్ కి వచ్చిన ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా: ప్రియాంక చోప్రా

  • ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను
  • ఒక హీరోయిన్ కోసం నన్ను సినిమా నుంచి తప్పించారు
  • ఎంతో పట్టుదలతో సక్సెస్ ను సాధించాను
నెపోటిజం... బాలీవుడ్ లో ఇప్పుడు దీనిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉందని... సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరని... ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని అణగదొక్కేస్తారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. నెపోటిజం కారణంగానే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చెపుతున్నారు.

ఇప్పటికే ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ఈ నెపోటిజంపై గళమెత్తారు. తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి... ఇప్పుడున్న వివాదాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితి  ఉందో, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటో చూద్దాం.

తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని... ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో... రెకమెండేషన్ తో వచ్చిన ఒక హీరోయిన్ కోసం,  తనను ఓ సినిమా నుంచి తప్పించారని తెలిపింది. గొప్ప వారసత్వం ఉన్న ఇళ్లలో పుట్టడం తప్పని తాను చెప్పడం లేదని... అయితే, కఠినమైన సమయాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తాను నేర్చుకున్నానని చెప్పింది.

తమ గమ్యం గురించి తప్ప, ఇతర ఏ అంశాల గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నానని... ఓటమి అనే భయాన్ని దగ్గరకు రానివ్వరాదని ప్రతిక్షణం తనను తాను మార్గనిర్దేశం చేసుకునేదాన్నని ప్రియాంక తెలిపింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఇండస్ట్రీలో సక్సెస్ ను సాధించానని చెప్పింది.


More Telugu News