టెర్రరిస్టుల కాల్పులు.. తాతయ్య మృతదేహం పక్కనే దిగాలుగా కూర్చున్న చిన్నారి.. ఫొటోలు వైరల్

  • జమ్మూకశ్మీర్‌లో ఘటన
  • తాతయ్యతో కలిసి సోపోర్‌లో ఓ ప్రాంతానికి బాలుడు
  • ఉగ్రవాదుల కాల్పులు.. తాతయ్య మృతి
  • అక్కడే కూర్చొని ఏడ్చిన చిన్నారి
ఓ బాలుడికి సంబంధించిన పలు ఫొటోలు నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కి చెందిన ఆ బాలుడి వయసు మూడేళ్లు.. తన తాతయ్యతో కలిసి సోపోర్‌లో ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఉగ్రదాడి జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో ఓ జవానుతో పాటు, అదే సమయంలో అక్కడే ఉన్న ఆ బాలుడి తాతయ్య శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. దీంతో తన తాతకు ఏం జరిగిందో తెలియక ఆ బాలుడు దిగాలుగా చూశాడు. అనంతరం తన తాతయ్య శరీరం నుంచి రక్తం కారుతుంటే ఏడుస్తూ అతడి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. అనంతరం ఆ బాలుడిని జవాన్లు అక్కడి నుంచి తీసుకెళ్లారు.

'సోపోర్‌లో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఆ బాలుడిని ఉగ్రవాదుల తూటాల బారి నుంచి రక్షించారు' అని పేర్కొంటూ పోలీసులు ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ బాలుడు మారుతి కారులో తన తాతతో కలిసి శ్రీనగర్‌ నుంచి హంద్వారాకు వెళ్తుండగా కాల్పులు జరిగాయని, ఈ విషయాన్ని గుర్తించి ఆ బాలుడి తాతయ్య కారును ఆపి పిల్లాడితో కలిసి సురక్షిత చోటుకి వెళ్లాలని ప్రయత్నించగా అతడికి తూటాలు తగిలాయని వివరించారు.

ఆ బాలుడిని రక్షించిన అనంతరం ఓ వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు పోస్ట్ చేశారు.
               


More Telugu News