1918లో స్పానిష్ ఫ్లూను, ఇప్పుడు కరోనాను జయించిన ఏకైక భారతీయుడు!

  • నాలుగేళ్ల వయసులో స్పానిష్ ఫ్లూ నుంచి కోలుకున్న బాలుడు
  • ఇప్పుడు కరోనా సోకినా జయించి, ఇంటికి
  • వెల్లడించిన ఢిల్లీ ఆసుపత్రి వైద్యులు
ఢిల్లీలోని ఓ శతాధిక వృద్ధుడు, ఇప్పుడు కరోనాను జయించాడు. అంతేకాదు, 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి బారి నుంచి కూడా అతను అప్పట్లో బయటపడ్డాడు. ఆపై ఇప్పుడు కరోనా సోకినా దాన్నీ జయించాడు. ఈ ఘటన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగింది. అతని 70 ఏళ్ల కుమారుడు కూడా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతనికన్నా వేగంగా అతని తండ్రి కోలుకోవడాన్ని వైద్యులు ఓ అద్భుతంగా చూస్తున్నారు.

1918లో స్పానిష్ ఫ్లూ నుంచి కోలుకుని, ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న తొలి వ్యక్తి ఇతనే కావచ్చని ఆర్జీఎస్ఎస్హెచ్ సీనియర్ డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. సరిగ్గా 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని పట్టుకుంది. ఆ సమయంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది వైరస్ బారిన పడ్డారు. హెచ్1ఎన్1 వైరస్ రకం తన రూపును మార్చుకుని స్పానిష్ ఫ్లూగా వచ్చింది. ఇది ఎక్కడి నుంచి మొదలైందన్న విషయంపై స్పష్టమైన సమాచారం లేదుగానీ, ప్రపంచమంతా వ్యాపించింది. దీని బారినపడి దాదాపు 4 కోట్ల మంది వరకూ మరణించారని అందుబాటులోని గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ఢిల్లీ శతాధిక వృద్ధుడికి అప్పట్లో స్పానిష్ ఫ్లూ సోకిందా? లేదా? అన్న విషయమై పూర్తి సమాచారం లేకున్నా, ఆయన రెండు మహమ్మారులను చూశాడన్నది మాత్రం నిజమని హాస్పిటల్ వైద్యులు వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా 106 ఏళ్ల వయసులో ఉన్న ఓ వ్యక్తి, తన విల్ పవర్ ను ప్రదర్శించాడని ఆయన అన్నారు.


More Telugu News