టీటీడీ 'సప్తగిరి' మాసపత్రికతో పాటు క్రైస్తవ పత్రిక అందిన వైనం.. కలకలం రేపిన ఘటనపై పోలీసుల విచారణ

  • తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే మాసపత్రిక సప్తగిరి
  • పత్రికను వేయించుకుంటోన్న హిందూ భక్తుడు
  • ఈ నెల ఆ పత్రికతో పాటు అన్యమత పత్రిక వచ్చిన వైనం
  • 'సజీవ సువార్త' పేరిట పుస్తకం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే సప్తగిరి మాసపత్రిక విషయంలో ఇటీవల కలకలం చెలరేగింది. ఆ పత్రికను వేయించుకునే హిందూ భక్తుడికి దానితో పాటు అన్యమత పత్రిక సువార్త పుస్తకం కూడా ఓకే పోస్టల్‌ కవర్‌లో అందింది. దీనిపై ఇప్పటికే స్పందించిన టీటీడీ ఈ విషయంలో తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గుంటూరులోని మల్లికార్జునపేటకు చెందిన సప్తగిరి పత్రిక చందాదారుడు రత్నవిష్ణు ఇంటికి వచ్చారు. తాను ప్రతి నెల వేయించుకునే సప్తగిరి మాసపత్రికతో పాటు ఈ నెల 'సజీవ సువార్త' అనే క్రైస్తవ మాసపత్రిక వచ్చిన తీరును ఆయన పోలీసులకు వివరించాడు. తాను ఇప్పటికే ఈ విషయంపై టీటీడీ విజిలెన్స్‌ సెల్‌కు ఫిర్యాదు చేశానని చెప్పాడు.

టీటీడీ ఫిర్యాదు మేరకు తాము విచారణ జరుపుతున్నామని, ఆ పత్రిక అతడికి ఎలా వచ్చిందో తేల్చుతామని పోలీసులు చెప్పారు. సప్తగిరి మాసపత్రికను వేయించుకునే ఇతరులను ఇప్పటికే టీటీడీ సిబ్బంది ప్రశ్నించగా వారికి మాత్రం ఎటువంటి అన్యమత పత్రికా రాలేదని తెలిసింది.


More Telugu News