రూ. 746 కోట్ల రుణం.. ఒక్క రూపాయి కూడా వసూలు చేసుకోలేకపోయిన ఎస్బీఐ!

  • గతంలో రుచి సోయాకు భారీ రుణం
  • ఒక్క రూపాయి కూడా కట్టని రుచి సోయా
  • సంస్థను విలీనం చేసుకునేందుకు తాజాగా 'పతంజలి'కి రుణం
  • ఎస్బీఐ వైఖరిని ప్రశ్నిస్తున్న వాటాదారులు
ఇండియాలో బ్యాంకుల కార్యకలాపాలు ఎంత అధ్వానంగా సాగుతున్నాయనడానికి ఇది ఇంకో ఉదాహరణ. గతంలో రుచి సోయాకు రూ. 746 కోట్ల రుణాన్ని ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో నుంచి ఒక్క రూపాయిని కూడా వసూలు చేసుకోలేకపోగా, ఇప్పుడు తీవ్ర నష్టాలపాలై కుదేలైన అదే సంస్థను కాపాడేందుకు బాబా రామ్ దేవ్ నేతృత్వంలోని 'పతంజలి ఆయుర్వేద' సంస్థకు ఏకంగా రూ. 1,200 కోట్ల రుణాన్ని అందించింది..ఈ విషయం తెలుసుకుని విస్తుపోయిన ఎస్బీఐ షేర్ హోల్డర్లు బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

కాగా, రుచీ సోయా ఇండస్ట్రీస్ కు ఇప్పటికే ఐబీసీ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్) కింద ఇచ్చిన రుణాన్ని ఎన్పీఏ (నిరర్ధక ఆస్తులు) కింద బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటించింది. ఇప్పుడు అదే కంపెనీని విలీనం చేసుకునేందుకు పతంజలికి భారీ రుణాన్ని ఇచ్చింది. ఎస్బీఐ ఒక్కటే కాదు... పలు బ్యాంకుల కన్సార్టియం, పతంజలికి మొత్తం రూ. 3,200 కోట్ల రుణాన్ని ఇచ్చాయి.

ఇక రుచి సోయా నుంచి పలు బ్యాంకులకు మొత్తం రూ. 12,416 కోట్ల రూపాయలు రావాల్సి వుంది. ఎస్బీఐకి రూ. 1,800 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 816 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 743 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 608 కోట్లు, డీబీఎస్ కు రూ. 243 కోట్లు రావాల్సి వున్నాయి. విఫలమైన సంస్థ కోసం మళ్లీ రుణాలు ఇవ్వడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్బీఐ వాటాలు ఉన్న పూణే కేంద్రంగా పనిచేస్తున్న సజాగ్ నాగరిక్ మంచ్ అధ్యక్షుడు వివేక్ వేలాంకర్ కోరగా, ఎస్బీఐ రుచి సోయాకు ఇచ్చిన రుణాల వివరాలను వెల్లడించింది. ఇదిలావుండగా, పతంజలి సంస్థ రుచి సోయాను విలీనం చేసుకునే ముందు రూ. 350గా ఉన్న ఈక్విటీ విలువ, ఆపై భారీగా పెరిగి ప్రస్తుతం రూ. 1,535కు చేరడం గమనార్హం.


More Telugu News