అమెరికాలో ఊహించని రీతిలో కరోనా ఉద్ధృతి.. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన ఐఎంఎఫ్‌

  • మరోసారి షట్‌డౌన్‌ తప్పకపోవచ్చు
  • లోపాలను సరిదిద్దుకోవాలి
  • ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.6 శాతం తగ్గే అవకాశం
  • ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి
  • ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలి  
అమెరికాలో కరోనా ఉద్ధృతి ఊహించని స్థాయిలో ఉంది. ప్రతిరోజు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో తిరిగి పుంజుకునే అవకాశాలు కనపడట్లేదు. దీనిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) స్పందిస్తూ.. అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో మరోసారి షట్‌డౌన్‌ తప్పకపోవచ్చునని అభిప్రాయపడింది.

అమెరికాలో విస్తరిస్తున్న పేదరికంతో పాటు ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ నివేదికలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం తమ దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 37 శాతం తగ్గిందని తెలిపింది.

ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.6 శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పింది. కరోనా ఉద్ధృతి వల్ల అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మరోసారి ఆంక్షల్ని విధించారని, హిస్పానిక్‌, నల్లజాతీయుల వంటి అల్పాదాయ వర్గాలపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది.

అమెరికాలోని అనేక రంగాల్లో నష్టాలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులు పేదరికం పెరగడాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌కు తగ్గట్లుగా మార్కెట్‌ను పెంచుకునేలా ఉద్దీపన చర్యలు చేపట్టాలని చెప్పింది. పేదలకు ఆ ఉద్దీపన కరోనా పరిస్థితుల్లో సాయంగా నిలవాలని సూచించింది.


More Telugu News