మాంచెస్ట‌ర్ టెస్టులో పొర‌పాటున బంతికి ఉమ్ము రాసిన ఇంగ్లండ్ క్రికెట‌ర్

  • కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్ము రాయడంపై నిబంధనలు
  • బంతిని శానిటైజ్ చేసిన అంపైర్లు
  • పొరపాటున ఉమ్ము రాసినట్లు అంగీకరించిన సిబ్లే 
కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బంతికి ఉమ్ము రాయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న కూడా తీసుకొచ్చారు. అయితే, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్ట‌ర్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో ఇంగ్లండ్ క్రికెట‌ర్ డామ్ సిబ్లే బంతికి ఉమ్ము రాయడంతో ఆ బంతిని అంపైర్లు శానిటైజ్ చేయాల్సి వచ్చింది.

ఆట 4‌వ రోజున ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇంగ్లండ్‌ ఆటగాడు సిబ్లే పొరపాటున బంతికి ఉమ్ము రాయడంతో, ఈ విషయం ఇంగ్లండ్ టీమ్‌ అంపైర్ల‌కు చెప్ప‌డంతో వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. పొరపాటున ఉమ్ము రాసినట్లు సిబ్లే ఒప్పుకున్నాడు. కాగా, బంతికి ఉమ్ము రాయడం క్రికెటర్లకు అలవాటే.

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉమ్ము రాస్తే ప్ర‌తి జ‌ట్టుకు ఇన్నింగ్స్‌లో 2 సార్లు హెచ్చరిక చేస్తారు. రెండు కంటే అధికసార్లు రాస్తే కనుక, ఆ జ‌ట్టుపై 5 ప‌రుగుల పెనాల్టీ వేస్తారు. కాగా, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్ట‌ర్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లో సిబ్లే తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేశాడు.


More Telugu News