ఇకపై ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీయడం అంత తేలిక కాదు!

  • రక్షణ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే సినిమా
  • విడుదలకు ముందు రక్షణ శాఖకు ప్రత్యేక ప్రదర్శన
  • ఎన్ఓసీ లేకపోతే సెన్సార్ నిలిపివేత
ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కొన్ని భారీ హిట్లు కాగా, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. భారత్ లోని అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమల్లో ఆర్మీ ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఫ్లాష్ బ్యాక్ లోనైనా భారత సైన్యం ప్రస్తావనతో వచ్చిన సినిమాలకు లెక్కేలేదు. అయితే ఇకమీదట ఆర్మీపై ఎడాపెడా సినిమాలు తీయడం వీలు కాకపోవచ్చు. కొన్ని సినిమాలు సైన్యం ఔన్నత్యాన్ని చాటే విధంగా ఉంటుండగా, మరికొన్ని సినిమాలు ఆర్మీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉంటున్నాయి. ఈ క్రమంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏ భాషలోనైనా సైన్యం నేపథ్యంలో సినిమా తీయాలంటే ఇకమీదట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణశాఖకు ముందుగానే కథ చెప్పి వారిని ఒప్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, సినిమా విడుదల సమయంలోనూ రక్షణ శాఖ ప్రతినిధులకు ప్రత్యేక స్క్రీనింగ్ వేయాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందితేనే ఆ సినిమాకు మోక్షం కలుగుతుంది. అంతేకాదు, ఆర్మీ ఇతివృత్తంతో తెరకెక్కే సినిమాలు ఎన్ఓసీ తీసుకోని పక్షంలో వాటికి సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేస్తారు. ఈ ఆంక్షలన్నింటికి సిద్ధపడితేనే ఆర్మీ కథతో సినిమా తెరకెక్కుతుంది.


More Telugu News