ప్రగతి భవన్ ను ముట్టడించిన వారిలో కేసీఆర్ అన్న మనవడు.. సీఎంపై రమ్యారావు ఫైర్!

  • పీపీఐ కిట్లు ధరించి ప్రగతి భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు
  • 37 మంది విద్యార్థులు రిమాండ్ కు తరలింపు
  • వీరిలో కేసీఆర్ అన్న కూతురు కుమారుడు రితేశ్
ప్రగతి భవన్ ముట్టడిలో ఊహించని కొత్త కోణం వెలుగుచూసింది. పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ)కు చెందిన 37 మంది కార్యకర్తలు నిన్న ప్రగతి భవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. వీరందరిపై కేసులు పెట్టిన పోలీసులు అందరినీ రిమాండ్ కు తరలించారు. వీరందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.

అయితే, ముట్టడించిన వారిలో కేసీఆర్ కు వరుసకు మనవడు అయ్యే రితేశ్ కూడా ఉండటం కలకలం రేపుతోంది. కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కుమారుడే రితేశ్ కావడం గమనార్హం. ఈ  కేసులో రితేశ్ ను ఏ5గా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తన కుమారుడిని కేసులో ఇరికించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రమ్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని... విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని... ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారని చెప్పారు. విద్యార్థులను రిమాండ్ కు పంపించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.

 విద్యార్థులు అక్కడకు మారణాయుధాలతో వెళ్లలేదని... పీపీఈ కిట్లు వేసుకుని నిరసన తెలిపేందుకు వెళ్లారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల జీవితాలను నాశనం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విద్యార్థులను రిమాండ్ కు తరలించలేదని... ఇప్పుడు ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.


More Telugu News