అన్నీ అనుకున్నట్టు పూర్తయితే 62 వేల ఉద్యోగాలు వచ్చేవి: జగన్ పై చంద్రబాబు ఫైర్

  • అమరావతి అనేది 5 కోట్ల ప్రజల కలల రాజధాని
  • ప్రతిపక్ష నేతగా అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతును ప్రకటించారు
  •  62 ప్రాజెక్టులకు అమరావతిలో శ్రీకారం చుట్టాం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు ఓట్లు వేసింది కష్టాలు తీర్చేందుకా? లేక కష్టాల్లోకి నెట్టేందుకా? అని ఆయన ప్రశ్నించారు. రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పదేపదే ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు. అమరావతి అనేది 5 కోట్ల ప్రజల కలల రాజధాని అని చెప్పారు. 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం అమరావతి అని... 5 జాతీయ రహదారులను అమరావతి కలుపుతుందని తెలిపారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు నీటి సమస్య ఉందని... అమరావతికి ఆ సమస్య లేదని చెప్పారు. ప్రతిపక్ష నేతగా అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతును ప్రకటించారని అన్నారు.

కరోనాపై నిర్లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశారని... ఇప్పుడు రాజధాని తరలింపుతో పరిస్థితిని మరింత దారుణంగా తయారు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సంపద సృష్టికి అమరావతి ఒక కేంద్ర స్థానమని... అదొక స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అని అన్నారు. రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు సంపద అమరావతి నుంచి వచ్చేదని చెప్పారు. 62 ప్రాజెక్టులకు అమరావతిలో శ్రీకారం చుట్టామని... వాటి విలువ రూ. 53 వేల కోట్లు అని తెలిపారు. ఇప్పటికే రూ. 41 వేల కోట్ల పైచిలుకు పెట్టామని అన్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తయి ఉంటే 62 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.

అమరావతి నిర్మాణం పూర్తైతే  ఎంతో ఆదాయం పొందవచ్చని చంద్రబాబు అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతిని ముందుకు తీసుకుపోవచ్చని చెప్పారు. నిర్మాణాల ద్వారానే ఎంతో ఆదాయం వస్తుందని తెలిపారు. అన్ని విధాలా అభివృద్ధికి అనువైన ప్రాంతమని చెప్పారు. అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రం బాగుపడేదని అన్నారు. అనాగరిక చర్యలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాలను అమ్మడానికి మీరెవరు? అని ప్రశ్నించారు.


More Telugu News