ఆసుపత్రిలో చేరడానికి వారం ముందు పనసపండు కావాలని కోరిన ప్రణబ్ ముఖర్జీ!

  • ఇటీవల జరిగిన ఒక ఘటన గురించి వివరించిన ప్రణబ్ కుమారుడు
  • పనసపండును ఎంతో ఇష్టంగా తిన్నారన్న అభిజిత్ ముఖర్జీ
  • షుగర్ లెవెల్స్ కూడా పెరగలేదని వెల్లడి
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ బెంగాల్ రాజకీయాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఒక ఘటన గురించి వివరించారు. ఆసుపత్రిలో చేరడానికి ఒక వారం ముందు తన తండ్రి తనకు ఫోన్ చేశారని... పనసపండు తినాలని ఉందని చెప్పారని ఆయన తెలిపారు. కోల్ కతా నుంచి పనసపండు తెచ్చిపెట్టాలని అడిగారని... దీంతో, తాను వెంటనే బిర్హూం జిల్లాలోని తమ స్వగ్రామం మిరాటకి వెళ్లానని చెప్పారు. అక్కడ 25 కిలోల బరువున్న ఒక పనసపండును  కోయించి... ఆగస్టు 3న రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానని తెలిపారు.

తన తండ్రి పనసపండును ఎంతో ఇష్టంగా తిన్నారని... ఆయనకు షుగర్ లెవెల్స్ కూడా పెరగలేదని అభిజిత్ చెప్పారు. ఎంతో హ్యాపీగా ఉన్న ఆయన... అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా అని తేలిందని... ఆ తర్వాత మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ కూడా చేశారని చెప్పారు. నాన్నను చూసేందుకు నాలుగు సార్లు ఆసుపత్రికి వెళ్లానని ... చివరిసారి చూసినప్పుడు ఆయన శ్వాస కూడా నిలకడగా ఉండటాన్ని గమనించానని తెలిపారు.


More Telugu News