మా నాన్న కోలుకుంటున్నారు... ఎవరూ ఆందోళన చెందవద్దు: ఎస్పీ బాలు తనయుడు చరణ్

  • కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు
  • పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స
  • ఆడియో సందేశం వెలువరించిన తనయుడు ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి ఆసుపత్రి పాలవగా, గత రెండ్రోజుల నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు చరణ్ ఊరట కలిగించే వార్త చెప్పారు. ఎస్పీ బాలు క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో సందేశాన్ని వెలువరించారు.

"మా నాన్న ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్లందరికీ నేను బదులివ్వాలంటే సోషల్ మీడియానే సరైన మార్గం అనిపించింది. అందుకే అందరి కోసం ఓ ఆడియో సందేశాన్ని పోస్టు చేస్తున్నాను. మా నాన్న ఆరోగ్యం కాంక్షించే వారిలో అన్ని భాషల వారు ఉండడంతో, అందరికీ అర్థమయ్యేలా నేను ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నాను.

మా నాన్న పరిస్థితి మెరుగవుతోంది. నిన్న ఆయనకు వెంటిలేషన్ అమర్చి చేసిన చికిత్స సత్ఫలితాలను ఇస్తోంది. ఆయన నిదానంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. డాక్టర్లు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మేం కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాము. ఎప్పుడన్నది చెప్పలేను కానీ, ఆయన ఈ సంక్షోభం నుంచి తప్పక బయటపడతారు. మీ అందరి ప్రార్థనలకు కృతజ్ఞతలు" అంటూ తన సందేశంలో పేర్కొన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ లో పంచుకున్నారు.



More Telugu News