ఈ దేశంలో ఒక్క కరోనా కేసు లేదు... కానీ ఆర్థికంగా కుదేల్!

  • పసిఫిక్ ద్వీప దేశాల్లో కనిపించని కరోనా
  • మార్చి నుంచే సరిహద్దులు మూసేసిన చిన్నదేశం పలావ్
  • టూరిస్టులు లేక, ఆదాయం రాక విలవిల
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ భూతం ప్రపంచంలోని మెజారిటీ దేశాలపై ప్రభావం చూపిస్తున్నా, పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని దీవులు మాత్రం ఈ మహమ్మారి బారినపడలేదు. అలాంటి ద్వీప దేశాల్లో పలావ్ ఒకటి. గతేడాది చివరి నుంచి ఉనికిని చాటుకుంటున్న కరోనా వైరస్ పలావ్ లో ఇంకా కాలుమోపలేదు. ఇప్పటివరకు ఈ చిన్నదేశంలో ఒక్క పాజటివ్ కేసు కూడా లేదు. చైనా నుంచి వెలుపలికి వ్యాపించిన కరోనా వైరస్ మార్చి నుంచి ఇతర దేశాలపై ప్రభావం చూపడం ప్రారంభించింది. దాంతో మార్చి చివరి వారం నుంచి పలావ్ తన సరిహద్దులు మూసేసి కరోనాను సమర్థంగా కట్టడి చేసింది.

కరోనా ఎంట్రీని నిరోధించింది కానీ, అదే సమయంలో తన ప్రధాన ఆర్థికవనరు అయిన పర్యాటక రంగాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. విదేశాల నుంచి పర్యాటకులెవరూ రాకపోవడంతో పలావ్ ఆర్థికవ్యవస్థ క్షీణించింది. 2019 పలావ్ దేశానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య 90 వేలు. ఆ దేశ జనాభాకు అది ఐదు రెట్లు ఎక్కువ. పలావ్ జీడీపీలో 40 శాతం టూరిజం ద్వారానే వస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. అయితే అదంతా కరోనాకు ముందు మాట.

ప్రపంచ దేశాలను కరోనా చుట్టేయడం ప్రారంభించాక పరిస్థితి మారిపోయింది. అక్కడ ప్రఖ్యాత పలావ్ హోటల్ ఒక్క పర్యాటకుడు రాక వెలవెలపోయింది. ఆ హోటల్ మాత్రమే కాదు, అక్కడి రెస్టారెంట్లు, గిఫ్ట్ షాపులు అన్నీ మూతపడ్డాయి. త్వరలోనే ఈ పరిస్థితి తొలగిపోయి మళ్లీ తమ టూరిజం రంగం పునరుజ్జీవం పొందుతుందని పలావ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News