కరోనా నుంచి కోలుకున్నప్పటికీ రెండో సారి సోకిన వైరస్‌!

  • హాంకాంగ్‌లో ఘటన
  • లక్షణాలూ కనపడిన వైనం
  • స్పెయిన్ నుంచి హాంకాంగ్‌కు తిరిగి వచ్చిన వ్యక్తి
  • భిన్నమైన కరోనా జాతి లక్షణాలు  
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా వైరస్ తన రూపును మార్చుకుంటూ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ గురించి తెలియని విషయాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. సాధారణంగా వైరస్ సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తై రెండో సారి ఆ వైరస్‌ బారిన పడకుండా రోగ నిరోధక శక్తి వస్తుంది.

అయితే, మూడు నెలల క్రితం కరోనా సోకి కోలుకున్న ఓ వ్యక్తి మరోసారి కరోనా బారిన పడిన ఘటన హాంకాంగ్‌లో వెలుగు చూసింది. దీంతో కరోనాపై ఈ విషయం మరింత ఆందోళన కలుగజేసేలా ఉంది. కొన్ని రోజుల క్రితం స్పెయిన్ నుంచి హాంకాంగ్‌కు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి (33)కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఆయనతో భిన్నమైన కరోనా జాతి లక్షణాలు ఉన్నాయని జన్యు పరీక్షలలో వెల్లడైందని పరిశోధకులు గుర్తించారు.

ఆ వ్యక్తే మార్చిలో కరోనా బారిన పడి కోలుకున్నట్లు వివరించారు. ఆ వ్యక్తికి మొదటిసారి కరోనా సోకినప్పుడు లక్షణాలు కనిపించాయని, రెండవసారి మాత్రం ఎలాంటి లక్షణాలు కనపడలేదని చెప్పారు. హాంకాంగ్ విమానాశ్రయంలో  స్క్రీనింగ్ చేయడంతో అతడికి కరోనా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి సుదీర్ఘకాలం ఉండటం లేదని తెలిసిందని చెప్పారు. అంతేగాక, కొందరు రెండో సారి కరోనా‌ బారిన పడుతున్నట్లు తెలిసిందని తెలిపారు. ఎంత మందిలో ఇలా జరుగుతుందో ఇప్పట్లో చెప్పలేమని వివరించారు. దీంతో బడులు తెరవడం, కార్యాలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిల్లోనూ ఇది ప్రభాపం చూపే చాన్స్ ఉందన్నారు.



More Telugu News