హైదరాబాద్‌లో దారుణం.. రౌడీ షీటర్‌ను పొడిచి చంపిన ప్రత్యర్థులు

  • హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవుపల్లిలో ఘటన
  • ఇతర రౌడీషీటర్లతో విభేదాలు
  • కాపుకాసి వేటేసిన ప్రత్యర్థులు
హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవుపల్లిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. అన్సారీ రోడ్డుకు చెందిన రౌడీషీటర్ జాడు జావేద్ (32)కు ఇతర రౌడీషీటర్లతో విభేదాలున్నాయి.

ఈ నేపథ్యంలో జావేద్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రత్యర్థులు అతడిపై నిఘా పెట్టారు. గత రాత్రి ఒంటరిగా కనిపించిన జావేద్‌ను ప్రత్యర్థులు వెంబడించి కత్తులతో దాడిచేశారు. తలపై ఏకంగా 12 సార్లు కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న జావేద్‌ను అతడి స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News