ఎట్టకేలకు నేడు విడుదల కాబోతున్న ఐపీఎల్ షెడ్యూలు

  • ప్రకటించిన ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్
  • బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్
  • ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వీక్‌డేలో ఫైనల్ మ్యాచ్
ఎట్టకేలకు నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2020) షెడ్యూలు విడుదల కాబోతోంది. నిజానికి షెడ్యూలు మొన్ననే విడుదలవుతుందంటూ వార్తలు వచ్చినా ఈ విషయంలో ఐపీఎల్ మాత్రం ధ్రువీకరించలేదు. తాజాగా, నిన్న ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ఐపీఎల్ షెడ్యూలును ఆదివారం విడుదల చేయనున్నట్టు తెలిపారు. యూఏఈ వేదికగా ఈనెల 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ నవంబరు 10న ముగియనుంది. దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

మ్యాచ్‌లు జరిగే నగరాల్లో క్వారంటైన్ నిబంధనలు ఒక్కోలా ఉండడంతోపాటు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో కరోనా కేసులు బయటపడడంతో షెడ్యూలు ప్రకటించడం ఆలస్యమైనట్టు పటేల్ తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షెడ్యూలును ఖరారు చేసినట్టు వివరించారు.

మరోవైపు, రెండేసి మ్యాచ్‌లు జరగనున్న రోజుల సంఖ్యను ఐపీఎల్ బాగా తగ్గించినట్టు సమాచారం. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ సీజన్ కాబోతోంది. నిజానికి గతేడాది ఫైనలిస్టుల మధ్య మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, సీఎస్‌కే జట్టు ఆటగాళ్లు కరోనా బారినపడడంతో ఆ జట్టు తన లీగ్ మ్యాచ్‌లను ఆలస్యంగా ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రారంభ మ్యాచ్ శనివారం జరగనుండగా, పైనల్ మ్యాచ్ మాత్రం వారం మధ్యలో జరగనుండడం విశేషం. ఐపీఎల్ 13 ఏళ్ల చరిత్రలో వీక్‌డేలో ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. అలాగే, సాయంత్రం మ్యాచ్‌లు 8 గంటలకు బదులు 7:30 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో 10 మధ్యాహ్న మ్యాచ్‌లు కూడా ఉండడం గమనార్హం.


More Telugu News