శరీరంలో యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కరోనా నుంచి రక్షణ కలుగుతుందని చెప్పలేం: శాస్త్రవేత్తల వెల్లడి

  • యాంటీబాడీలు కరోనా వచ్చిందనడానికి సూచికలన్న సైంటిస్టులు
  • వీటిని అంచనా వేయలేమని వివరణ
  • ఎంతకాలం ఉంటాయో చెప్పలేమన్న శాస్త్రవేత్తలు
మానవ దేహంలో యాంటీబాడీలు ఉంటే గతంలో కరోనా వచ్చిందనడానికి సూచికలు మాత్రమేనని, వాటితో భవిష్యత్తులో మళ్లీ కరోనా సోకకుండా రక్షణ కలుగుతుందని మాత్రం చెప్పలేమని భారత శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ తరహా యాంటీబాడీలను అంచనా వేయలేమని, అవి ఏ స్థాయిలో ఏర్పడ్డాయో, అవి ఎంతకాలం ఉంటాయో చెప్పలేమని పేర్కొన్నారు.

కరోనా సోకిందనడానికి ఆధారాలే యాంటీబాడీలు అని, వాటిపై ఓ నిర్ధారణకు రావాలంటే వేచి చూడడమొక్కటే మార్గమని ఇమ్యూనాలజిస్టు సత్యజిత్ రథ్ తెలిపారు. శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు, సాధారణ యాంటీబాడీలు ఉంటాయని, వీటిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఆతిథ్య కణాల్లోకి కరోనా వైరస్ క్రిముల వ్యాప్తిని నిరోధిస్తాయని పూణేలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)కు చెందిన వినీతా బాల్ తెలిపారు. అయితే సాధారణ యాంటీబాడీలు మాత్రం వైరస్ శరీరంలోకి వచ్చిందన్న దానికి సూచికలుగా మాత్రమే నిలుస్తాయి తప్ప వాటితో పెద్దగా ఉపయోగం లేదని వెల్లడించారు.

న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటే కరోనాను నిరోధించగలుగుతాయన్న దానిపైనా ఏకాభిప్రాయం లేదని బాల్ పేర్కొన్నారు. దీని ఆధారంగా ప్లాస్మా థెరపీ ఎంత ఉపయుక్తమో కూడా చెప్పలేమని అన్నారు.


More Telugu News