సీరమ్ ఇనిస్టిట్యూట్ కు డీసీజీఐ షోకాజ్ నోటీసులు!

  • వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు ఇవ్వండి
  • వాలంటీర్లకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయా?
  • సమాచారాన్ని అందించాలన్న డీసీజీఐ
ఇండియాలో ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ ల సంయుక్త వ్యాక్సిన్  ట్రయల్స్ ను నిర్వహిస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) నోటీసులు జారీ చేసింది. తమ వ్యాక్సిన్ ట్రయల్స్ ను పలు దేశాల్లో నిలిపివేసినట్టు ఆక్స్ ఫర్డ్ ప్రకటించగా, ఇండియాలో ఆ ప్రభావం ఏమీ లేదని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించిన నేపథ్యంలో, ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటివరకూ జరిగిన ట్రయల్స్, వాటి ఫలితాల వివరాలను, వాలంటీర్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ లను గురించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.

కాగా, లండన్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ కు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాడవంతో ట్రయల్స్ ను బ్రిటన్ తో పాటు దక్షిణ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నిలిపివేస్తున్నామని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తరువాతనే తదుపరి ట్రయల్స్ కొనసాగింపుపై స్పష్టతనిస్తామని ఆస్ట్రాజెనికా సీఈఓ స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఇండియాలో ట్రయల్స్ కొనసాగుతున్నాయని సీరమ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.


More Telugu News