అమరావతి భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ

  • సిట్ నివేదిక ఆధారంగా కేసు
  • రాజధాని భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
  • కొన్నాళ్ల కిందట సిట్ నియామకం
  • నివేదికను ప్రభుత్వానికి అందించిన సిట్
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొంటూ, ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత విచారణకు సిట్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడా సిట్ నివేదిక ఆధారంగానే ఏసీబీ కేసు నమోదు చేసింది. అమరావతిలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి సిట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

 అసైన్డ్ భూములు, ఇతర భూముల లావాదేవీలపై పరిశీలన కోసం సిట్ అధికారులు గత రెండు వారాలుగా తుళ్లూరులోనే ఉన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి అన్ని భూ రికార్డులు తనిఖీ చేశారు. దీనిపై సర్కారుకు నివేదిక అందించారు. దాంతో కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది.

గతంలో టీడీపీ పాలనలో రాజధాని ప్రకటనకు ముందే అమరావతిపై సమాచారాన్ని కావాలనే లీక్ చేసి, తమకు కావాల్సిన వాళ్ల ద్వారా అక్కడ చాలా తక్కువ ధరకు భూములు కొనిపించారని, తెల్లకార్డుదారులను బినామీలుగా పెట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4 వేల ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు సిట్ నివేదిక నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయగా, ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News